Ration Rice Smuggling in AP : ప్రభుత్వం మారినా అక్కడ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా రేషన్ మాఫియాను పట్టించుకోవడం లేదు. అధికారుల అండతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు రేషన్ మాఫియాను వ్యవస్థీకృతం చేసి, లక్షల టన్నుల పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన నాయకుడికి కూటమి ప్రభుత్వంలోనూ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు సలాం కొడుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను అసభ్యంగా తూలనాడిన ఆ నేతకే జై అంటున్నారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసినా, అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్నా ఆయన సంగతేమోగానీ వీరు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. రేషన్ మాఫియాకు ఏమాత్రం అడ్డుకట్టపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా తనిఖీలకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా పోలీసు, రెవెన్యూ, రాష్ట్ర పన్నులు, రవాణా తదితర శాఖల నుంచి సహకారమనేది లేనే లేదు.