Visakhapatnam Division: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై కూటమి ప్రభుత్వ చేసిన ఒత్తిడి ఫలించింది. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా DPR సిద్ధమవుతోంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు వెళ్లాయి. తుది డీపీఆర్‌పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు ముసాయిదా డీపీఆరే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.