<p>Katleru Bridge Issue in NTR District : పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించాల్సిన దుస్థితి. నీటి ప్రవాహంలో కొంచెం అడుగు అటూ ఇటూ పడినా వరద ప్రవాహానికి బలి కావాల్సిందే. పనులు మానుకుని తల్లిదండ్రులు పిల్లల్ని యేరు దాటిస్తున్నారు. 5 కిలోమీటర్లు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి పరిస్థితి. ఇంకెంతకాలం ఈ కష్టాలు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్కడో కాదు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడపలోని దుస్థితి. వినగడప సమీప కట్లేరు వంతెన కొట్టుకుపోయి సుమారు ఏడేళ్లు అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడే మళ్లింపు మార్గం వేశారు. కానీ ప్రతిఏటా వర్షాకాలంలో పైనుంచి నుంచి వచ్చే వరద ప్రవాహానికి ఈ మార్గం కోతకు గురవుతోంది. వరద ఆగిపోగానే మరమ్మతులు చేయడం తిరిగి వరద రావడం మళ్లీ కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల వచ్చిన వర్షానికీ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ 10 రోజులకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రానికి వచ్చేందుకు ఏటి అవతలి ఆరు గ్రామాల ప్రజలు తిప్పలు పడుతున్నారు. మండల కేంద్రానికి వచ్చేందుకు 2 నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏటి అవతలి నారికింపాడు, తండా, వినగడప, కొత్తపల్లి, అనుముల్లంక, కనుమూరు గ్రామాల ప్రజలు దూరభారమైనా తిరువూరు మండలం మీదుగా వ్యయప్రయాసలకోర్చి 50 కిలో మీటర్లు ప్రయాణాలు సాగించి గమ్యం చేరుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కట్లేరుపై వంతెన నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.</p>
