<p>12 Feet Big Python Hulchul in Kanigiri : ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో 12 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. పట్టణంలోని కాశి నాయన ఆలయ సమీపంలో ఓ ఇంటి ముందు ఉన్న సెంట్రింగ్ సామాను మధ్యలో భారీ కొండచిలువ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే కోళ్లు పెద్దగా అరుస్తూ ఉండటంతో గమనించిన స్థానికులు వెళ్లి చూసేసరికి భారీ కొండచిలువ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఆదేశాల మేరకు డీఆర్వో రెడ్యానాయక్, కనిగిరి బీట్ ఆఫీసర్ సిద్ధల నరసింహం ఘటనా స్థలికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను అతి కష్టం మీద బంధించి సమీపంలోని పునుగోడు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. డీఆర్వో రెడ్యానాయక్ మాట్లాడుతూ, 'ఓ ఇంటి ఎదురుగా ఉన్న సెంట్రిన్ సామాను మధ్యలో ఈ కొండచిలువ చుట్టుకొని పడుకొని ఉంది. అది గమనించిన అక్కడి వారు అటవీ శాఖ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను పట్టుకున్నాము. అనంతరం దాన్ని పునుగోడు రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టాము. ఈ కొండచిలువ దాదాపు 12 అడుగులు ఉంటుంది' అని అన్నారు.<i> </i></p>
