<p>CM Chandrababu Naidu Conducts Aerial Survey: ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆకాశ మార్గం నుంచే కీలక ప్రాజెక్టుల తీరుతెన్నులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు, నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఐటీ కంపెనీల భవనాల పనులను నిశితంగా గమనించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయపూర్-విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంత రోడ్లు, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టుల స్టేటస్‌పై ఆరా తీశారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పనులు ఎక్కడా ఆగిపోకూడదని, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. </p>
