<p>Minister Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్రంలో మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని మంత్రి హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగిందని గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే కలెక్టర్ల బదిలీ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదని, రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదని హితువు పలికారు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. మంత్రులపైనే కాదు సీఎం రేవంత్ రెడ్డిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతలు విమర్శలు చేయొచ్చని కానీ మీడియా చేయటం సరికాదని, మీడియాకు ఎంతో బాధ్యత ఉంటుందని, దాన్ని విస్మరించొద్దని హితువు పలికారు. అధికారుల కుటుంబాల గౌరవం గురించి కూడా ఆలోచించాలని, విమర్శలను నేతలు తట్టుకోగలరని, మహిళా అధికారులు తట్టుకోలేరన్నారు.</p>
