<p>Sankranthi Pottelu Pandalu : రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందేలు, గుండాటలు, జూదం వీటితో పాటు పొట్టేళ్ల పందాలు వంటి క్రీడలు జోరుగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో పొట్టేళ్ల పందాలు జోరుగా సాగాయి. ప్రేక్షకుల ఈలలు, కేరింతల నడుమ ఈ పందాలు రసవత్తరంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రత్యేకమైన బహుమతులను గెలుచుకున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దయెత్తున రైతులు, క్రీడాభిమానులు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. సమీప ప్రాంత ప్రజలు అనేక మంది తరలి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడలు అంతరించిపోకుండా వీటిని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు పొట్టేళ్ల పందాల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలను తిలకించడానికి ఉద్యోగరీత్యా వివిధ పట్టణాల్లో స్థిర నివాసాలు ఉంటున్న స్థానికులు వచ్చారు. ఈ పందాల కోసం ప్రతి సంవత్సరం పట్టణాల్లో ఉంటున్న వారు కార్లలో సొంత గ్రామాలకు రావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. </p>
