<p>Sammakka Saralamma Temple : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు ముందుగానే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా రద్దీ మరింత పెరిగింది. ఇవాళ సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల తరహాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా అమ్మవార్లను దర్శించుకునేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా మేడారం జాతర జరగనుంది. ఈసారి ఉత్సవాల కోసం ప్రభుత్వం 251 కోట్లను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టింది. గద్దెల విస్తరణ, క్యూలైన్లు ఏర్పాటు చేసింది. భక్తులు బస్సులతో పాటు సొంత వాహనాలతో రావడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినా రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. </p>
