<p>Tiger Footprints Identified by Officials Authorities in Eluru District : ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం శివారులోని గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే మార్గంలోని పొగాకు తోటలో బుధవారం ఉదయం పెద్దపులి తిరగటాన్ని స్థానిక యువకుడు గుర్తించాడు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పొగాకు తోటలో పెద్దపులి నడిచినట్లు పాదముద్రలను సేకరించారు. పాద ముద్రలు పెద్దపులివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రజలు తిరగవద్దని అధికారులు సూచించారు. </p><p>'ఈరోజు ఉదయం రవీంద్రరెడ్డి అనే అతను పెద్దపులిని చూశానని సమాచారం ఇవ్వడంతో హూటాహుటిన మా సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి వచ్చాం. ఇక్కడ పొలాలు అన్నింటిని పరిశీలించి, పెద్దపులి పాదముద్రలను గుర్తించాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.' - కె.రాంబాబు, అటవీ అధికారి </p>
