<p>Republic Day Celebrations 2026: ఈ నెల 26న జరగబోయే రిపబ్లిక్‌డే అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి వేదిక కానుంది. తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతం నడిబొడ్డున నేలపాడులో తొలిసారి జరగబోయే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్, ప్రధాన వేదిక పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలీసుల కవాతు, పోలీస్ బ్యాండ్‌తో రాజధాని ప్రాంతం మారు మోగుతోంది. వేడుకల నిర్వహణతో రాజధానికి మరింత వైభవం తీసుకొచ్చేలా కూటమి సర్కారు సరికొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. వేడుకలకు సర్వం సిద్ధం చేశామని, భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 కంటింజెంట్‌లు రిహర్సల్స్లో పాల్గొంటున్నాయన్నారు. 20 ఎకరాల్లో వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మొత్తం 10 వేల మంది పాల్గొనేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు (శనివారం) ముందస్తు పరేడ్ నిర్వహించారు. పరేడ్‌లో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆదివారం సాయంత్రంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వేడుకలు నిర్వహించే హైకోర్టు రోడ్డులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. </p>
